నాలాలోనే “జనతా బార్”
పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..!
కాలువ మాయం… అధికారుల మౌనం
ప్రభుత్వ భూమిపై యథేచ్ఛగా నిర్మాణం
వరద ముప్పుపై స్థానికుల ఆందోళన
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
తక్షణ చర్యలకు ప్రజల డిమాండ్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ భూముల రక్షణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణం మధ్యలో ఉన్న నాలాను పూర్తిగా ఆక్రమించి అక్కడే “జనతా బార్” నిర్వహిస్తున్న సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది. కాలువ ఆనవాళ్లే మాయం చేసి నిర్మాణం చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. బీ.వై. నగర్ పరిధిలోని రాయిన్ చెరువు పరిసరాల్లో ఈ అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. చెరువుకు అనుబంధంగా ఉన్న కాలువలను క్రమంగా ఆక్రమించుకుంటూ వస్తున్న పరిస్థితిలో, ఓ వ్యక్తి పూర్తిగా నాలా స్థలాన్నే కబ్జా చేసి బార్ నిర్మించడం మరింత వివాదాస్పదంగా మారింది. స్థానికుల ప్రకారం కాలువను పూర్తిగా పూడ్చి, దాని ఆనవాళ్లను కూడా చెరిపేసి నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

కాలువలే మాయం… ప్రమాద సంకేతాలు
సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై గోపాల్ నగర్ ప్రాంతంలో ఈ కబ్జా జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పట్టణ అభివృద్ధికి కీలకమైన డ్రైనేజ్ వ్యవస్థను ధ్వంసం చేయడం వల్ల భవిష్యత్తులో వరద ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కాలువలు, నాలాలు సహజంగా నీటి పారుదల కోసం అవసరమైనవి. అవి లేకపోతే వర్షాకాలంలో నీరు నిల్వై ముంపు సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆక్రమణలు పట్టణ భద్రతకే ముప్పుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణం రోజుకో అడుగు ముందుకేసి పూర్తి దశకు చేరుకున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇంత పెద్ద స్థాయిలో నిర్మాణం జరుగుతున్నా అధికారులు ఎలా గమనించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతి ఇచ్చారు..? లేదా అనుమతి లేకుండానే ఎలా కొనసాగింది..? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం లేదా మౌన సహకారం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్తుల రక్షణ ఎక్కడ..?
పట్టణంలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నా వాటిని రక్షించాల్సిన యంత్రాంగం స్పందించకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ప్రజల అవసరాల కోసం ఉంచిన వనరులు అక్రమాలకు గురవడం అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణను తొలగించి, కాలువలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. నాలాలోనే బార్ నిర్మాణం ఘటన పట్టణ పాలనపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారా… లేక ఈ వ్యవహారం కూడా కాలగర్భంలో కలిసిపోతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.


