కాకతీయ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం ఉద్యమం పేరుతో తాడ్వాయి మండలం కాల్వపల్లి,ఊరట్టం,బయక్క పేటలో ఇటీవల మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం వాల్ పోస్టర్లను వెలిసించడంతో గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోస్టర్లో ప్రజాస్వామ్యబద్ధమైన శాంతియుత జీవనం మన హక్కు అని, గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ పల్లెలు, ఆదివాసి గూడెలు నక్సలైట్ల/మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి దిశగా సాగుతున్నాయని, ఒకప్పుడు అమాయక ఆదివాసులను అడ్డం పెట్టుకొని వారి ప్రాణాలను బలికొనిపెట్టి ఉనికిని కొనసాగించేందుకు ప్రయత్నించిన మావోయిస్టుల కార్యకలాపాలు తెలంగాణ ప్రజల తెలివైన నిర్ణయం, సహకార నిరాకరణ వల్ల పూర్తిగా అదృశ్యమయ్యాయని.. ఒకప్పుడు అభివృద్ధికి అడ్డుగోడలైన మావోయిస్టుల హింస ఇప్పుడు చరిత్రగా మిగిలిందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వారి మోసపూరిత చర్యలను బహిర్గతం చేసి సహకరించకపోవడంతో, మావోయిస్టులు గత్యంతరం లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని.. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల నిరాకరణ కారణంగా అక్కడ మనుగడ కష్టమవుతుందని గ్రహించిన మావోయిస్టులు, మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, మావోయిస్టులు తిరిగి గ్రామాలలో, గూడెలలో కదలికలు ప్రారంభిస్తే, శాంతియుత జీవనానికి విఘాతం ఏర్పడటమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధి ఆగిపోతుందని.. ముఖ్యంగా ఆదివాసి యువతకు భవిష్యత్తు చీకటి కమ్మే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు, ఆదివాసి సోదర సోదరీమణులు ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులకు సహకరించకూడదని.. మన ప్రాంత అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు కోసం మావోయిస్టులకు సహకరించకూడదని. వారిని హింసామార్గం విడిచి, సాధారణ ప్రజా జీవితంలోకి రావాలని ప్రోత్సహించండని లేఖలో పేర్కొన్నారు.


