ధాన్యం నిల్వకు గోదాములు సిద్ధం చేయాలి
కొనుగోలు సీజన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
కాకతీయ, పెద్దపల్లి : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. రాఘవపూర్ జీఎంఆర్ వేర్‌హౌసింగ్ గోదాములు, శాంతినగర్ గోదాములను అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, గోదాముల్లో ఇప్పటికే ఉన్న బియ్యాన్ని వెంటనే తరలించాలని సూచించారు. కొత్తగా వచ్చే ధాన్యం నిల్వకు తగిన స్థలం ఖాళీగా ఉంచాలని ఆదేశించారు. ఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలోని గోదాములన్నీ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వైద్య సేవలపై సమీక్ష
ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో, యునాని వైద్య కళాశాలను సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ పర్యటనలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, డీసీఎస్ఓ శ్రీనాథ్, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


