అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్‌లో ఎన్సీసీ శిబిరం
కాకతీయ, కరీంనగర్ /కొత్తపల్లి : విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావన పెంపొందించాలనే ఉద్దేశంతో అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న కెడెట్లతో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు నైతిక విలువలను అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు. విధేయత, ఏకాగ్రత, పరస్పర సహకారం వంటి గుణాలను అలవర్చుకోవాలని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉండాలని తెలిపారు.
ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు దేశసేవ పట్ల అవగాహన పెరుగుతుందని, సంస్థలో ఎన్సీసీ శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సుమారు 150 మంది విద్యార్థులకు శిక్షణతో పాటు భోజన వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
శిబిరంలో అందిస్తున్న వసతులు, నాణ్యమైన ఆహారంపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై ఎన్సీసీ అధికారులు కూడా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్ధిపేట, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్సీసీ కెడెట్లు, అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


