తనిఖీలన్నీ ఉత్త గ్యాస్..!
కరీంనగర్‌లో యథేచ్ఛగా డొమెస్టిక్ దందా
వ్యాపారాలకు మళ్లుతున్న గృహ గ్యాస్ కనెక్షన్ సిలిండర్లు
5 వేల హోటళ్లకు 2,717 కమర్షియల్ సిలిండర్ల కనెక్షన్లు
డొమెస్టిక్ సిలిండర్లతోనే దాదాపుగా హోటల్ వ్యాపారం
ఈకేవైసీ అమల్లో గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం..
ఏజెన్సీల పనితీరును పరిశీలించని పౌరసరఫరాల శాఖ అధికారులు
తూతూ మంత్రంగా తనిఖీలు.. రికార్డుల వెరిఫికేషన్
మాములుగానే వదిలేస్తున్న అధికారులు..
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల లెక్కలు, వాస్తవ వినియోగం మధ్య భారీ వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. అధికారిక గణాంకాలు ఒకలా ఉండగా, నేలమీద పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. సబ్సిడీ డొమెస్టిక్ గ్యాస్ వ్యాపార అవసరాలకు మళ్లుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,69,101 గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ అందులో 4,66,384 డొమెస్టిక్ కనెక్షన్లే ఉన్నాయి. కమర్షియల్ కనెక్షన్లు కేవలం 2,717 మాత్రమే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో జిల్లాలో 5,000కు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, దాబాలు, హాస్టళ్లు కొనసాగుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం వేలాది వ్యాపార సంస్థలు కమర్షియల్ గ్యాస్ లేకుండానే నడుస్తున్నట్లు అర్థమవుతోంది.
గ్యాస్ కనెక్షన్లలో కాకి లెక్కలు..!
జిల్లాలో 7,000 వరకు ఆహార వ్యాపార కేంద్రాలు ఉన్నట్లు అంచనా. కానీ కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు మాత్రం 2,717 మాత్రమే. మిగతా వేలాది హోటళ్లు ఏ గ్యాస్‌తో నడుస్తున్నాయన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఇదే పరిస్థితి డొమెస్టిక్ గ్యాస్ దుర్వినియోగాన్ని బహిర్గతం చేస్తోంది. హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, మానకొండూరు ప్రాంతాల్లో విస్తృతంగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం కొనసాగుతున్నట్లు సమాచారం. ట్రేడ్ లైసెన్సులు ఉన్న సంస్థలకే కమర్షియల్ కనెక్షన్లు లేకపోవడం వ్యవస్థలోని లోపాలను చూపిస్తోంది. జిల్లాలో 23 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. హెచ్పీసీఎల్ 9, ఐవోసీఎల్ 6, బీపీసీఎల్ 8 ఉన్నాయి. కానీ కనెక్షన్ల జారీ, వినియోగంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా కష్టమైనా జిల్లాలో ఫుడ్ వ్యాపారం పెద్దగా దెబ్బతినకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అంటే డొమెస్టిక్ గ్యాస్ వినియోగమే ఈ వ్యాపారాలకు ఆధారమైందన్న మాట.
గ్యాస్ దుర్వినియోగానికి కారణాలు..!
డొమెస్టిక్ సిలిండర్ ధర సబ్సిడీతో తక్కువగా ఉండటం, కమర్షియల్ సిలిండర్ ధర ఎక్కువగా ఉండటం దుర్వినియోగానికి ప్రధాన కారణంగా మారింది. తక్కువ ధరలో లభించే గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు మళ్లించడం ద్వారా కొందరు అక్రమ లాభాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సీఎస్ఆర్ కింద 27,454 కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ అవి ఎవరికి చేరాయి, ఎక్కడ వినియోగంలో ఉన్నాయి అన్న విషయంపై స్పష్టత లేదు. ఇదే అంశం వ్యవస్థ పారదర్శకతపై సందేహాలు పెంచుతోంది.
ఈకేవైసీ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు కాలేదని సమాచారం. సగానికి పైగా కనెక్షన్లు ఇంకా ధృవీకరణలో లేవు. అయినప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇది కొనసాగితే సబ్సిడీ గ్యాస్ మరింత దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది. అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ అందకపోయే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్యాస్ పంపిణీ వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే కలెక్టర్ స్థాయిలో జోక్యం చేసుకుని ప్రక్షాళన చేపట్టాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో గ్యాస్ వినియోగ వ్యవస్థలో లోపాలు బయటపడుతున్నాయి. లెక్కలు ఒకలా, వాస్తవం మరోలా ఉండటం అధికార యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


