రాజీ మార్గమే రాజమార్గం
లోక్ అదాలత్తో వేగవంతమైన న్యాయం
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కాకతీయ, జగిత్యాల : జాతీయ మెగా లోక్ అదాలత్ను వినియోగించుకుని ప్రజలు తమ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. రాజీ మార్గమే ఉత్తమ పరిష్కారమని తెలిపారు. మార్చి 28న నిర్వహించబడే లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక సమస్యలు ఇందులో పరిష్కారం అవుతాయని చెప్పారు. బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు, చిన్నపాటి కేసులు కూడా పరిష్కారం అవుతాయని వివరించారు. ఒకే వేదికపై వేగంగా న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. కోర్టులపై భారం తగ్గుతుందని తెలిపారు. బాధితులకు త్వరగా న్యాయం అందుతుందని చెప్పారు. పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది ముందుగానే కేసులను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.


