వాళ్లు నాటారు.. వీళ్లు నరికారు..
పచ్చదనంపై గొడ్డలి వేటు
శాఖల సమన్వయ లోపమే కారణమా
కాకతీయ, గీసుగొండ : మొక్కలు నాటి పెంచుతున్న ప్రభుత్వాలు, అదే చెట్లను నరికివేస్తున్న పరిస్థితి మండలంలో చర్చనీయాంశంగా మారింది. పచ్చదనం పరిరక్షణపై విరుద్ధ చర్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. హరితహారం నుంచి వన మహోత్సవం వరకు మొక్కల పెంపకం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలు వాటిని చెట్లుగా అభివృద్ధి చేశాయి. అయితే మరియాపురం సహా పలు గ్రామాల్లో విద్యుత్ తీగలకు ఆటంకం పేరుతో చెట్లను నరికివేస్తున్నారు. వేసవికాలంలో పచ్చని చెట్ల నరికివేతపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెంచిన చెట్లను తొలగించడం విరుద్ధ చర్య అని విమర్శిస్తున్నారు. మొక్కలు నాటే దశలోనే సరైన ప్రణాళిక లేకపోవడం, శాఖల మధ్య సమన్వయం లోపించడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అటవీ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. పచ్చదనం పరిరక్షణకు సమగ్ర చర్యలు అవసరమని సూచిస్తున్నారు.


