ఆరు నెలలుగా జీతాల్లేవు
వెంటనే బకాయిలు విడుదల చేయాలి
ఏటూరునాగారం సామాజిక వైద్యశాల సిబ్బంది ఆవేదన
కాకతీయ, ఏటూరునాగారం : ఆరు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సామాజిక వైద్యశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం సామాజిక వైద్యశాలలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ కింద ఎస్ ఎన్ సి యు కేంద్రంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, సపోర్టింగ్ స్టాఫ్ ఈ సమస్యను ప్రస్తావించారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు. మంత్రులకు కూడా జీతాల విషయంపై వినతులు సమర్పించినట్లు తెలిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని కోరారు. పెండింగ్ జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, భద్రయ్య, బతుకమ్మ, హసీనా, సుమలత, రాకేష్, దేవేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


