రాజు మృతి కేసులో న్యాయం చేయాలి
పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
సమగ్ర విచారణ జరుగుతోందన్న పోలీసులు
కాకతీయ, గీసుగొండ : అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయడం లేదని ఆరోపించారు. ఐదు నెలల క్రితం మృతి చెందిన ల్యాదెళ్ల రాజు కేసులో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొనగా, ఇది హత్యేనని కుటుంబీకులు అంటున్నారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మృతదేహంపై గాయాలు ఉన్నప్పటికీ పోస్టుమార్టం నివేదికలో ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐ విశ్వేశ్వర్ మాట్లాడారు. కేసుపై సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. మామునూరు ఏసీపీ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులను నచ్చజెప్పారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వద్దకు తీసుకెళ్లి వివరాలు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ధర్నాను విరమించారు. ఫోరెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.



