ములుగులో నకిలీ పత్రాల మాయజాలం
ఒకే ఆస్తిపై ముగ్గురి పేర్లు..
రూ.15 లక్షల లోన్ వ్యవహారంలో సంచలనం
తప్పుడు పత్రాలతో రికార్డుల సృష్టి
ఆర్టీఐతో బయటపడిన అసలు నిజాలు
వివరాలు వెల్లడించిన తోటకూరీ శ్రీకాంత్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు పట్టణంలో నకిలీ పత్రాలు, తప్పుడు రికార్డులతో భారీ మోసం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఆస్తిపై మూడు పేర్లు చుట్టుముట్టడం, అదే పత్రాల ఆధారంగా బ్యాంకు నుంచి రూ.15 లక్షల లోన్ పొందడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్టీఐ పిర్యాదుదారు తోటకూరీ శ్రీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం, ములుగు పట్టణంలోని ఇంటి నం. 2-134కి సంబంధించిన రికార్డులు ఒకరి పేరుతో ఉండగా, యాజమాన్యం మాత్రం మరో వ్యక్తి పేరుతో నమోదు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఆస్తికి మూడు పేర్లు ఎలా వచ్చాయన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, మున్సిపల్ కమిషనర్‌తో విచారణ చేపట్టించారు. ఆ విచారణలో ధ్రువీకరణ పత్రం నకిలీ అని తేలినప్పటికీ, తప్పుడు పత్రాలు జారీ చేసిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇంత పెద్ద అక్రమం బయటపడినా అధికారులు స్పందించకపోవడం వెనుక కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గిఫ్ట్ డీడ్, లోన్ వ్యవహారం మిస్టరీ
అదే ఆస్తిపై గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ జరగడం, ఆ పత్రాల ఆధారంగా బ్యాంకు నుంచి లోన్ మంజూరు కావడం ఈ కేసుకు మరింత మలుపు తీసుకొచ్చింది. బ్యాంకు రికార్డుల్లో 2008 నుంచే పాజెషన్ ఉన్నట్లు చూపించడం అనుమానాలను మరింత పెంచుతోంది. అయితే, ఆ సమయంలో సంబంధిత వ్యక్తి మైనర్‌గా ఉండటం ఈ వ్యవహారంలో కీలక అంశంగా మారింది. పదో తరగతి చదువుతున్న సమయంలోనే ఆస్తి పాజెషన్ చూపించడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అలాగే వివాహం జరగకముందే పేరు మార్పులు చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
మృతురాలి పేరుతో రికార్డులు…
ఇంకా విచిత్రమైన అంశం ఏమిటంటే, 2006లో మరణించిన మహిళ పేరుతో 2008లో పత్రాలు రూపొందించి మ్యూటేషన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి రికార్డులు మార్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నకిలీ పత్రాలు ఎవరు జారీ చేశారు, రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, బ్యాంకు లోన్ ఎలా మంజూరైంది అన్న ప్రశ్నలకు ఇంకా స్పష్టత రాలేదు. పైగా ఆర్‌టీఐ ప్రశ్నలకు “రికార్డులు లేవు” అన్న సమాధానం రావడం అధికారుల వైఖరిపై మరింత అనుమానాలను పెంచుతోంది. ఈ కేసు నకిలీ పత్రాలు, రికార్డు మార్పులు, ఆర్థిక మోసం, అధికారుల నిర్లక్ష్యం కలిసిన పెద్ద ఎత్తున అక్రమాలుగా కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదుదారు డిమాండ్ చేస్తున్నారు.


