3 నెలల్లో 28 మృతి.. కీడు భయంతో ఊరు ఖాళీ
దోష నివారణకు ‘కీడు వంటలు’ ఆచారం
జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో కలకలం
కాకతీయ, జమ్మికుంట : వరుస మరణాలతో గ్రామానికి కీడు పట్టిందనే భయం వ్యాపించడంతో గ్రామస్థులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఊరంతా ఖాళీ చేసి సంప్రదాయ పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత 3 నెలల్లో 28 మంది వివిధ కారణాలతో మృతి చెందారు. ఈ ఘటనలు గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. గ్రామ పెద్దలు, పురోహితుల సూచనతో దోష నివారణకు ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేసి పొలాల్లోనే తాత్కాలికంగా నివసించారు. అక్కడే వంటలు చేసి ‘కీడు వంటలు’ ఆచారం పాటించారు. సోమవారం తెల్లవారుజామునే గ్రామంలోని ప్రతి ఇంటికి తాళాలు వేశారు. డప్పు చాటింపు ద్వారా గ్రామస్థులను అప్రమత్తం చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పొలాలకు తరలిపోయారు. రోజంతా అక్కడే గడిపారు. ఈ ఆచారం ద్వారా చెడు శక్తులు తొలగిపోతాయని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు. అయితే వరుస మరణాలపై వైద్య కారణాలు కూడా పరిశీలించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు కారణాలపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


