లక్ష గులాబీ పూలతో అమ్మవారికి అర్చన
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహెూత్సవములు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. నాల్గవ రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట కల్పోక్త ప్రకారం వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా జరుపవలసిన విశేష జప హోమార్చనాభిషేకములు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష గులాబీ పులతో లక్షపుష్పార్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. నేడు లక్షపుష్పార్చన కార్యక్రమానికి కరీంనగర్ వాస్తవ్యులు, మైనింగ్ వ్యాపారవేత్తలు డా.శ్రీనివాస్- బాల జననీ దంపతులు వ్యవహరించారు. నేడు ఆదివారం కూడా కావడంతో భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు సత్వర దర్శన ఏర్పాట్లు దేవాలయ చైర్మన్ డా బి.శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్త తొనుపునూరి వీరన్నలు పర్యవేక్షించినట్లు కార్యనిర్వహణాధికారి రామల సునీత తెలిపారు.


