పుస్తక పఠనంతోనే జ్ఞానం సాధ్యం
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
కాకతీయ, కరీంనగర్: వ్యక్తి విజయం సాధించడానికి జ్ఞానం కీలకమని ఆ జ్ఞానం నిరంతరం పుస్తకాలు చదవడం ద్వారానే వస్తుందని స్వేరోస్ ఫౌండర్ చైర్మెన్, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో స్వేరోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుక్ రీడథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృతంగా వినియోగంలోకి రావడంతో పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిందన్నారు. అయితే ఆ టెక్నాలజీ కూడా పుస్తక పఠనం ద్వారా వచ్చిన జ్ఞాన ఫలితమేనని మరిచిపోవద్దని సూచించారు. టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్న వారు కూడా పుస్తక పఠనం మానలేదని కానీ మనం మాత్రం సోషల్ మీడియా, మొబైల్ వినియోగంలో మునిగిపోతూ పఠనాన్ని విస్మరిస్తున్నామని విమర్శించారు. పుస్తకాలు చదవకపోతే అజ్ఞానంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ జ్ఞానం లేకపోతే బానిసలుగా జీవించాల్సి వస్తుందని తెలిపారు. నిరంతరం పఠనం చేయడం వల్ల మెదడు చురుకుదనంతో పని చేసి కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు దారి తీస్తుందని ఇది శాస్త్రీయంగా నిరూపితమైందని పేర్కొన్నారు.స్వేరోస్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహించే భీం దీక్షలో భాగంగా ప్రతిరోజూ పుస్తక పఠనాన్ని తప్పనిసరి దినచర్యగా పాటిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరితో విక్టర్ ఈ ఫ్రాంకిల్ రచించిన ‘అర్థం కోసం అన్వేషణ’ పుస్తకాన్ని చదివించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మనోజ్, బాబు నాయక్, జిల్లా అధ్యక్షుడు అనిల్, ఆకినపల్లి శిరీష, అందె అజయ్ తదితరులు పాల్గొన్నారు.


