“నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే”
జీవన్ రెడ్డి పోస్టర్‌తో జగిత్యాలలో హీట్
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టర్
కాకతీయ, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన క్షణాల వ్యవధిలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు వెలసిన పోస్టర్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సినీ నటుడు రజనీకాంత్ ప్రసిద్ధ డైలాగ్ “నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే”తో జీవన్ రెడ్డి ఫోటో కలిపిన ఈ పోస్టర్ స్పష్టమైన రాజకీయ సందేశంగా నిలిచింది. పోస్టర్ బయటపడిన వెంటనే దాని ఫోటోలు సోషల్ మీడియాలో మెరుపువేగంతో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వెనక్కి తిరిగే అవకాశం లేదన్న సంకేతాన్ని అనుచరులు బలంగా ఇస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్యాడర్‌లో ఇప్పటికే ఉన్న ఉత్సాహం ఈ పోస్టర్‌తో మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జగిత్యాలలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ఈ పోస్టర్ మరింత ఉత్కంఠను రేకెత్తించింది. ఒకవైపు కాంగ్రెస్‌లో అంతర్గత కదలికలు వేగం పెంచుకోగా మరోవైపు జీవన్ రెడ్డి అనుచర వర్గం బల ప్రదర్శనకు దిగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో జగిత్యాలలో రాజకీయాలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి.


