పనుల్లో వేగం పెంచండి
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు దార్శనిక దేవాలయాలు..
విద్యపై అత్యధిక ప్రాధాన్యత ప్రభుత్వ లక్ష్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాకతీయ, బోనకల్ : విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాల నిర్మాణానికి పెట్టుబడిగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలను స్వయంగా పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు, గుత్తేదారులకు ఆదేశించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణాన్ని పరిశీలించారు. మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ల్యాబ్ భవనాలను తనిఖీ చేశారు. అన్ని పనులు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఈ స్కూళ్లు కేవలం భవనాలు కాదని తెలిపారు. రేపటి తరాలను తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలుగా అభివర్ణించారు. విద్యా రంగంలో నాణ్యతే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.


