అగ్ని ప్రమాద రైతులకు న్యాయం చేస్తాం
నష్టపోయిన వారికి పరిహారం తప్పనిసరి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కాకతీయ,మధిర : అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, మధిర మండలం ఆత్కూరులో అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, శీతల గిడ్డంగిలో రికార్డు ప్రకారం ఉన్న మిర్చి రైతులకు నిబంధనల మేరకు బీమా ద్వారా నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మళ్లీ మంటలు చెలరేగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధిర మార్కెట్లో కూడా మిర్చి కొనుగోలు, అమ్మకాలు ఖమ్మం మాదిరిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.


