కాకతీయ, బయ్యారం: మండలంలోని బాలాజీ పేట గ్రామంలో పెద్దఎత్తున ఉద్యమకారులతో ఆదివారం పోస్ట్ కార్డు కార్యక్రమం నిర్వహించినట్లు ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు అడిదల వీరభద్రం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రధానకార్యదర్శి గుండగాని రామనాథం ఆధ్వర్యంలో జరిపారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యదర్శి సోమారపు వీరస్వామి, బయ్యారం మండల అధ్యక్షుడు అడిదల వీరభద్రం, మహబూబాబాద్ జిల్లా బాధ్యుడు రంగశాయిపేట వాసి సురకంటి పద్మయ్య పాల్గొన్నారు.
ముఖ్యఅతిథి వీరస్వామి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాహుల్ గాంధీకి పోస్టుకార్డు ద్వారా డిమాండ్లు విన్నవించారు. ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఉద్యమకారులకు 250 చ.గజాల ఇంటి స్థలం, 25వేల రూపాయల పింఛన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కావున ఆ హామీలను వెంటనే అమలు చేయాలని వీరస్వామి కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులను జారీచేయాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ తరహాలో సంక్షేమ పథకాలల్లో నిధులు ఉద్యమకారులకు 20శాతం బస్సుపాస్, ఆసుపత్రి లో ఉచిత సేవలు కల్పించాలని, పొస్టుకార్డులను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిట్టల వీరన్న, గుగులోత్, భీముడు, వేల్పుల యాలాద్రి, ఎస్కె.జాని, గ్రామ ఉద్యమకారులు పాల్గొన్నారు.


