డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!
పడిపోతున్న బంగారం ధరలు
డాలర్ బలపడటమే ప్రధాన కారణం
వడ్డీ రేట్ల పెంపుతో గోల్డ్ నుంచి బాండ్లు, డిపాజిట్లకు పెట్టుబడుదారులు షిఫ్ట్
10 గ్రాముల ధర రూ.1.27 లక్షల వరకు తగ్గే ఛాన్స్
కాకతీయ, బిజినెస్ : సాధారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. గ్లోబల్ టెన్షన్స్ పెరిగినా… బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ విరుద్ధ ట్రెండ్‌కు ప్రధాన కారణం అమెరికన్ డాలర్ బలపడటమేనని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ విలువ పెరిగినప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఖరీదు పెరుగుతుంది. దీంతో కొనుగోళ్లు తగ్గి… డిమాండ్ క్షీణిస్తుంది. ఫలితంగా ధరలు క్రమంగా పడిపోతాయి.
వడ్డీ రేట్ల ఎఫెక్ట్
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి వడ్డీ రేట్ల పెంపుపై సంకేతాలు ఇస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు… పెట్టుబడిదారులు బంగారం వంటి ‘నాన్-ఇంటరెస్ట్’ ఆస్తుల నుంచి బయటకు వచ్చి, బాండ్లు, బ్యాంక్ డిపాజిట్ల వైపు మళ్లుతారు. ఇది కూడా బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం… స్వల్పకాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,000 నుంచి రూ.1,47,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే ఇదే ట్రెండ్ కొనసాగితే… భవిష్యత్తులో ధర రూ.1,27,000 వరకు పడిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం బంగారం మార్కెట్‌లో స్పష్టమైన అనిశ్చితి కనిపిస్తోంది. డాలర్ విలువ, వడ్డీ రేట్లు, గ్లోబల్ ఎకానమీ కలిసి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే… గ్లోబల్ ట్రెండ్స్‌ను గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


