ఆర్టీసీలో జాబ్ రేస్..
198 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం
26,160 మంది అభ్యర్థుల దరఖాస్తు
మార్చి 29న రాత పరీక్ష..
కాకతీయ,తెలంగాణ బ్యూరో : టీజీ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించేందుకు హాల్ టికెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 198 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టగా, అందులో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. భారీగా దరఖాస్తులు రావడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. మార్చి 29న రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షను రెండు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. రెండో విడత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మార్చి 23 ఉదయం 8 గంటల నుంచి మార్చి 28 అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా హాల్ టికెట్‌లో ఉన్న వివరాలను చెక్ చేసుకోవాలి. ఫొటో లేకపోతే పరీక్షకు అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు.
26,160 మంది అభ్యర్థుల దరఖాస్తు
మొత్తం 26,160 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 20,097 మంది ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టులకు, 6,063 మంది మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులకు అప్లై చేశారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా తదుపరి దశలకు ఎంపిక చేస్తారు. పరీక్ష సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించనున్నారు. వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలు తీసుకుంటారు. అందువల్ల చేతులపై మెహందీ, టాటూలు ఉండకూడదని స్పష్టం చేశారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఎదురైతే ఈమెయిల్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతం ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.


