లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్
ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం కఠిన రూల్స్
ఫైన్ చెల్లించకుంటే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రీజ్
ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ట్రాఫిక్ చలాన్లను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగనుంది. పెండింగ్ చలాన్లు ఎక్కువగా ఉండి, వాటిని చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెండూ ఫ్రీజ్ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ తీసుకవచ్చేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో కూడా ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలతో వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు. కొత్త రూల్స్ ప్రకారం ఏడాదిలో ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉండి, వాటిని చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఫైన్లను నిర్లక్ష్యం చేస్తే మొదటగా లైసెన్స్, ఆ తర్వాత వాహన రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. ఇది వాహనదారులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఒకసారి ఫ్రీజ్ అయితే వాహనం వినియోగం పూర్తిగా నిలిచిపోతుంది.
డెడ్‌లైన్ మించితే సీజ్ తప్పదు
చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్ట గడువు ఇస్తుంది. సాధారణంగా నలభై ఐదు రోజుల సమయం ఉంటుంది. ఈ గడువులోపు ఫైన్ చెల్లించకపోతే వాహనంపై కఠిన చర్యలు ప్రారంభమవుతాయి. గడువు ముగిసిన తర్వాత కూడా పెండింగ్ కొనసాగితే సీజ్ ప్రక్రియ తప్పదు. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల తప్పుగా చలాన్లు పడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ ఏర్పాటు చేయనుంది. ఈ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. పొరపాటుగా జారీ చేసిన చలాన్లను పరిశీలించి రద్దు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కొత్త నిబంధనలు వాహనదారుల్లో చర్చకు దారితీశాయి. ట్రాఫిక్ రూల్స్‌ను కచ్చితంగా పాటించడం తప్పనిసరి అవుతోంది. హెల్మెట్ ధరించడం, సిగ్నల్ జంప్ చేయకపోవడం వంటి ప్రాథమిక నిబంధనలను పాటించడం ద్వారా చలాన్ల నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే లైసెన్స్, వాహనం రెండూ ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది.


