ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు
కాకతీయ,రాయపర్తి : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ సంబరాలు మిన్నంటాయి.శనివారం ఈ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో,ఉత్సాహంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఆచరించిన కఠిన ఉపవాస దీక్షలు ఈద్-ఉల్-ఫితర్ పండగతో ముగిసాయి.ఉదయాన్నే ముస్లిం సోదరులందరూ నూతన వస్త్రాలు ధరించి
ఈద్గాకు చేరుకున్నారు.ఈ నేపథ్యంలో మతగురువుల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు (సలాత్ అల్-ఈద్) నిర్వహించారు.చిన్న పెద్ద అంతా కలిసి భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఈద్గా మైదానాలు కళకళలాడాయి.ప్రార్థనలు ముగిసాక ఒకరినొకరు ఆలింగణం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈద్గా నుంచి నేరుగా కబ్రస్తాన్ లకు చేరుకొని తమ పూర్వీకుల సమాధులపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.నమాజ్ ముగించుకుని ఇళ్లకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు,అతిథులు అందరూ కలిసి మొదటగా పాలు,సేమియా,పంచదార,ఎండు ఖర్జూరాలతో తయారు చేసిన వారి సాంప్రదాయ తీపి వంటకం (షీర్ ఖుర్మా)ను ఆరగించి సోదర భావాన్ని చాటుకున్నారు.మండల కేంద్రంలోని వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిని అనుకోని ఉన్న ఈద్గా మైదానంలో మజీద్-ఏ-నూర్ మజీద్ కు చెందిన మత గురువు ఇర్ఫాన్ ఆలమ్ ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు.రంజాన్ పండుగ కేవలం ఉపవాస దీక్షలతో ముగింపు కాదని,అది క్రమశిక్షణ,త్యాగం,మానవత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.నెల రోజుల పాటు పాటించిన పవిత్రతను,సేవా భావాన్ని జీవితాంతం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.


