అప్పులు తీసుకుని ఐపీ దాఖలు!
51 మంది పేదల నుంచి కోట్ల వసూళ్లు
ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఆయుధం
ముందుగానే ఆస్తుల బదిలీలు
రూ.1.86 కోట్ల బాకీతో దివాలా పిటిషన్
రోడ్డెక్కిన బాధితుల ఆవేదన
కాకతీయ, ఎర్రుపాలెం : నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని పేదలు, కూలీల నుంచి అప్పులు తీసుకున్న వ్యక్తి చివరికి దివాలా పిటిషన్ దాఖలు చేయడం ఎర్రుపాలెంలో కలకలం రేపింది. మధిర నియోజకవర్గ పరిధిలోని జమలాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాధితులు రోడ్డెక్కి న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామానికి చెందిన కొర్లకంటి రామచంద్రరావు మినీ కళ్యాణమండపం, హోటల్ నిర్వహిస్తూ స్థానికులతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడు. అదే నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని 51 మంది పేద, మధ్యతరగతి ప్రజల నుంచి లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వడ్డీ ఆశ చూపుతూ ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కోట్ల రూపాయలు సేకరించినట్లు చెబుతున్నారు.
ముందస్తు ప్రణాళిక… ఆస్తుల బదిలీ?
ఇప్పటికే కొద్ది నెలల క్రితమే తన ఆస్తులను ఇతరులకు బదిలీ చేసి నగదును మళ్లించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఒక్కసారిగా కనిపించకుండా పోయి, తాను వ్యాపారంలో నష్టపోయానని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించాడు. 51 మందికి రూ.1.86 కోట్ల బాకీ ఉందని తెలిపి తనను దివాలాగా ప్రకటించాలని కోరాడు. ఈ నెల 13న ఖమ్మం జిల్లా కోర్టు అతనిని ఆర్థికంగా నిస్సహాయుడిగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో బాధితులకు శుక్రవారం విషయం తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో జమలాపురం చేరుకుని అతని హోటల్ ఎదుట బైఠాయించారు. “మా కష్టార్జితాన్ని తిరిగి ఇవ్వాలి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను పంపించారు. అయినప్పటికీ తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేస్తున్నారు.


