గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే
కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు
మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్‌కే భవిష్యత్ అని ధీమా
మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
కాకతీయ, గజ్వేల్ : స్వల్ప తేడాతో మున్సిపల్ పీఠం చేజారినా గజ్వేల్ ప్రజల అభిమానం మాత్రం కాంగ్రెస్ వైపే ఉంది అని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ప్రజ్ఞాపూర్‌లో జరిగిన పార్టీ చేరికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ఫలితాలు సాధించామని అన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థులతో పోలిస్తే ఆర్థికంగా పోటీ చేయలేకపోయినా, కార్యకర్తల కృషితో గణనీయమైన ఫలితాలు సాధించామని వివరించారు. స్వల్ప తేడాతో మున్సిపల్ పీఠం చేజారిందని చెప్పిన ఆయన, గజ్వేల్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారని తెలిపారు. వారి విశ్వాసాన్ని నిలబెట్టేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, ఓడిన అభ్యర్థులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, మరో 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా వేతనం, అలవెన్సులు పొందిన కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన బిఆర్ఎస్ నేతలు చట్టపరమైన చర్యలను తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు షరీఫ్, నేతలు సారిక శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


