చిన్నారిపై నుంచి వెళ్లిన లారీ
అక్కడికక్కడే మృతి.. ,శంకరపట్నంలో ఘటన
కాకతీయ,శంకరపట్నం : మండలంలోని అంబేద్కర్ కూడలిలో శనివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఉపాధి చేసుకొనే ముద్ధ కమ్మరి వర్గానికి చెందిన శ్రావణ్ కుటుంబానికి చెందిన చిన్నారి నిత్య (3) రహదారిపై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనం ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలు నిత్య, శ్రావణ్‌కు నలుగురు కుమార్తెలలో చిన్నది కావడం కుటుంబాన్ని మరింత విషాదంలో ముంచింది. ఈ ఘటనతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరీంనగర్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న లారీగా గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్‌ను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. చిన్నారి మృతితో గ్రామంలో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


