రేపు రైతు భరోసా…
విడతల వారీ ప్రక్రియతో రైతుల్లో ఉత్కంఠ
ఎకరం లోపు రైతులకు తొలి ప్రాధాన్యం?
ఎకరానికి రూ.6 వేలే మొదట జమ
అర్హతలపై స్పష్టత లేక టెన్షన్…
ఎక్కువ భూమి ఉన్న రైతుల్లో అసంతృప్తి
కొత్త విధానంపై భయాందోళనలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు నేడే విడుదల కానుండటంతో ఆశలతో పాటు ఉత్కంఠ కూడా పెరిగింది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి విడత నిధులు జమ కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేయనున్నారు. అయితే ఈ విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనుండటంతో మిగిలిన రైతులు తరువాతి విడతల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రబీ సీజన్ చివరి దశకు చేరుకొని పంటలు కోతల దశలోకి వెళ్లిన సమయంలో నిధుల విడుదల ఆలస్యం కావడం రైతుల్లో అసంతృప్తిని పెంచుతోంది. సాయం కోసం ఎదురుచూసిన రైతులకు ఇప్పుడు కొత్త విధానం మరింత గందరగోళాన్ని తెచ్చింది.
భారీగా పెట్టుబడి.. ఆలస్యంగా సాయం
ఈ రబీ సీజన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 3.16 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 2.72 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 14 వేల ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నాయి. ఒక్కో ఎకరానికి రూ.20 వేల వరకు ఖర్చు పెట్టిన రైతులు విత్తనాలు, ఎరువులు, కూలీలతో భారీ పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ సాయం వస్తుందనే ఆశతో సాగు ప్రారంభించిన రైతులు ఇప్పుడు బ్యాంకులు, ప్రైవేట్ వనరుల నుంచి సుమారు రూ.544 కోట్ల వరకు రుణాలు తీసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఒకే సీజన్‌కు జిల్లాకు దాదాపు రూ.200 కోట్ల వరకు రైతు భరోసా అందగా, ఈసారి కోతల సమయానికి కూడా నిధులు అందకపోవడం రైతుల్లో ఆవేదనకు కారణమైంది.
కొత్త విధానంతో రైతుల్లో గందరగోళం..
ఈసారి ప్రభుత్వం రైతు భరోసాను మూడు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించింది. నేడే తొలి విడతగా రూ.3,590 కోట్లు, ఏప్రిల్ మధ్యలో రెండో విడతగా రూ.2,650 కోట్లు, నెలాఖరులో మూడో విడతతో మొత్తం రూ.9,000 కోట్లు జమ చేయనుంది. అయితే తొలి విడతలో ఎకరానికి రూ.12,000 సాయంలో కేవలం ఒక ఎకరానికి మాత్రమే రూ.6,000 జమ చేయడం రైతుల్లో సందేహాలకు దారితీస్తోంది. ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు పూర్తి సాయం వెంటనే అందకపోవడం అసంతృప్తిని పెంచుతోంది. మూడు విడతల విధానం వల్ల పూర్తి సాయం అందుతుందా లేదా అన్న అనుమానం గ్రామాల వరకు చర్చనీయాంశంగా మారింది.
సర్వే ప్రభావం… అర్హతలపై సందేహాలు
శాటిలైట్ సర్వే కారణంగా నిధుల విడుదల ఆలస్యమైందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం సాగులో ఉన్న భూములకే సాయం పరిమితం చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. దీంతో చాలామంది రైతులు అనర్హులయ్యే అవకాశం ఉందన్న భయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోతల దశకు చేరుకున్న పంటలకు భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు “ఈ సీజన్‌కు రైతు భరోసా అందుతుందా?” అన్న సందేహంలో ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టత రాకపోవడంతో గ్రామాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి.


