కాకతీయ, వరంగల్ : నగరంలోని రామన్నపేటలోని రఘునాథ్ కాలనీకి చెందిన బీజేవైఎం కార్యకర్త ఎలకలపెల్లి సురేష్ ఇల్లు శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. కాగా ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ స్థానిక బిజెపి నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు.
ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వారి ఇల్లు పూర్తిగా దగ్ధమవడం బాధాకరమని సురేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. సురేష్ చిరు వ్యాపార సామగ్రి, నిత్యావసర వస్తువులు, ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మేయర్ డివిజన్ లో అగ్ని ప్రమాదం జరిగినా స్పందించకపోవడం, స్థానిక ఎమ్మెల్యే బాధితులను కలవకపోవడం వారి బాధ్యతరాహిత్యం అని విమర్శించారు.
ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్, బిజెపి శివనగర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, నాయకులు కొత్తకొండ రాజేష్, రామిని సుమన్, నలివేల సతీష్, తదితరులు పాల్గొన్నారు.


