మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పిలుపు
31న రైతు సంఘం సదస్సును జయప్రదం చేయాలి
కాకతీయ, వరంగల్ : రైతులు అప్పులపాలు కాకుండా వారు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అలాగే మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని కోరారు. ఈ మేరకు వరంగల్ లోని అబ్బనికుంటలో గల రైతు సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం ఉపాధ్యక్షులు ఉరటి అంశాలరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31న ఇక్కడే రాష్ట్ర సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. రైతులు పెట్టే రూ.100 పెట్టుబడికి అదనంగా రూ.50 కలిపి మొత్తంగా రూ.150 చెల్లించాలని స్వామినాథన్ కమిటీ పేర్కొన్నా ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. ఎన్నికల సమయంలో గుర్తుకొచ్చే స్వామినాథన్ కమిటీ సూచనలు.. ఆ తర్వాత పాలకులు విస్మరిస్తున్నారని విమర్శించారు. అమెరికాలో వ్యవసాయ రంగానికి 50శాతం సబ్సిడీ ఇస్తుంటే మన దేశంలో 3% మాత్రమే ఇస్తున్నదని అన్నారు. కనీసం మన దేశంలో రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతోందని మండిపడ్డారు. వ్యవసాయ రంగం బలోపేతం కావాలంటే ఐక్య పోరాటాలతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య మాట్లాడుతూ ఈనెల 31న జరిగే సదస్సులో రైతాంగం సమస్యలు.. పరిష్కార మార్గాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు హాజరవుతున్నారని, తెలంగాణ వ్యాప్తంగా రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి సదస్సు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కమిటీ సభ్యులు మోకిడ పీరయ్య, జంగ జనార్దన్ రెడ్డి, లాడే మోహన్ రావు, రేముడాల దామోదర్ రెడ్డి, గుండెకారి రాజేశ్వరరావు, బొల్లు ఎల్లయ్య, నల్ల విజయేందర్, సముద్రాల రాజమౌళి, సోమిడి సాంబయ్య, రాజేందర్, సముద్రాల బిక్షపతి, రవీందర్ పాల్గొన్నారు.


