“అడవుల సంరక్షణ అందరి బాధ్యత”
“ఇళ్ల దగ్గర మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి”
కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పిలుపు
కాకతీయ, హన్మకొండ : “అడవులను కాపాడటం అందరి బాధ్యతే.. అందుకోసం అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్దే మొక్కలు నాటి సంరక్షించాలి” అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పచ్చదన పరిరక్షణపై స్పష్టమైన దిశను చూపించాయి. హనుమకొండ జిల్లా కాకతీయ జూలాజికల్ పార్క్‌లో తెలంగాణ అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఈ వేడుకలు జరిగాయి. ఫారెస్ట్ కాంప్లెక్స్, సుబేదారి నుంచి కాకతీయ జూపార్క్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అటవీ శాఖాధికారి బి.లావణ్య జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీ పర్యావరణ ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేసింది. ఇళ్ల వద్ద మట్టి పాత్రల్లో నీరు, ఆహారం ఉంచి పక్షులను రక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ సంరక్షణకు కట్టుబడ్డారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు ఇందారం నాగేశ్వర్ రావు, చెలుపూరి శ్యామ్ సుందర్, పిట్టల రవి బాబు, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిప్పని రాధిక, జూ పార్క్ అధికారులు సురిదాస్, శివ కుమార్, బీట్ ఆఫీసర్లు శారద, శ్వేత, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


