సోదరభావం, ఆధ్యాత్మికతకు ప్రతీక రంజాన్
మంత్రి కొండా సురేఖ
వరంగల్‌లోని వివిధ ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం ముస్లిం సోదరులు ఈద్గాలకు చేరుకుని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎల్‌బీ నగర్, మట్టేవాడ (పోతన నగర్), మరియు ఖిలా వరంగల్ ఈద్గాలను మంత్రి సందర్శించారు. అక్కడ ప్రార్థనలు ముగించుకున్న ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, దాతృత్వం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక అని అన్నారు. క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలు ముగించుకుని జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని చాటుతూ అందరూ కలిసికట్టుగా పండుగను జరుపుకోవడం సంతోషదాయకమని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


