హనుమకొండలో చైన్ స్నాచింగ్..
మూడు తులాల బంగారం అపహరణ..
కాకతీయ, హనుమకొండ :హనుమకొండలోని కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలో మధ్యాహ్నం సమయంలో గొలుసు దొంగతనం ఘటన చోటుచేసుకుంది. కాలనీలో నివసిస్తున్న మోడం స్వప్న తన నివాసం నుండి తాను పనిచేస్తున్న మగ్గం వర్క్‌షాప్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం సుమారు 3:15 గంటల సమయంలో, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో బాధితురాలు షాక్‌కు గురైంది. ఈ ఘటనపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా, ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల ఆనవాళ్ల కోసం విచారణ కొనసాగిస్తున్నారు.


