కాకతీయ హనుమకొండ : వరంగల్ కమిషనరేట్ పరిధిలో గణపతి నవరాత్రులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, మొత్తం 6683 గణేష్ విగ్రహాలు నెలకొల్పారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సెంట్రల్ జోన్‌లో 2675 విగ్రహాలు, ఈస్ట్ జోన్‌లో 2043 విగ్రహాలు, వెస్ట్ జోన్‌లో 1945 విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 50శాతం ఎక్కువగా గణేష్ మండపాలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు.
ముఖ్యంగా 6526 విగ్రహాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం విశేషమన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో మండపాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని, నిర్వాహకులకు తగిన సూచనలు అందజేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 6354 విగ్రహాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారని కమిషనర్ వివరించారు.
పెట్రోలింగ్ సిబ్బంది పగలు, రాత్రి మండపాలను సందర్శించి పాయింట్ బుక్‌లో సంతకాలు చేయడం ద్వారా భద్రతా పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ప్రతి స్టేషన్ అధికారి తమ పరిధిలోని మండపాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో కూడా మండప నిర్వాహకులు, ప్రజలు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


