రుద్రంగిలో చిరుత కలకలం
చిరుత దాడిలో పెంపుడు కుక్క మృతి
మండల రైతుల్లో భయాందోళన
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలు, రైతుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గోరిలాల్వ ప్రాంతంలో గురువారం రాత్రి చిరుతపులి దాడిలో పెంపుడు కుక్క మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బాధిత రైతు నాగారం బొర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం తన వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకకు కాపలాగా రెండు కుక్కలను కట్టేసి వెళ్లగా, శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ఒక కుక్క రక్తపు మడుగులో మృతి చెంది కనిపించిందన్నారు. రాత్రి సమయంలో అడవి నుండి వచ్చిన చిరుతపులి కుక్కపై దాడి చేసి చంపివేసినట్లు తెలిపారు. ఇటీవలే రూ.8 వేలతో కొనుగోలు చేసిన కుక్క మృతి చెందడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గోరిలాల్వ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో రైతులు పొలాలకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుండి దాడి జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసి తమ ప్రాణాలు, పశువులకు రక్షణ కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.



