ప్రశాంతంగా రంజాన్ పర్వదినం జరిగేలా చర్యలు
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు
ఈద్గాల్లో ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం బ్యూరో: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం నగరంలోని గోళ్లగూడెం ఈద్గా ప్రాంతాన్ని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సామూహిక ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్కింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులకు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు భానుప్రకాష్, సత్యనారాయణ, రాజిరెడ్డి పాల్గొన్నారు


