వరంగల్ నూతన బస్టాండ్ పనులు వేగం
రూ.75 కోట్లతో ఆధునిక నిర్మాణం
కూడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ, హనుమకొండ : వరంగల్ పాత బస్టాండ్ స్థానంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న నూతన బస్టాండ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కూడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఛైర్మన్ ఇప్పటికే పునాది పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పిల్లర్లు, స్లాబ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సుమారు రూ.75 కోట్ల వ్యయంతో 2 ఎకరాలు 32 గుంటల విస్తీర్ణంలో జి ప్లస్ 4 అంతస్తులతో అత్యాధునికంగా బస్టాండ్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఒకేసారి 32 బస్సులు నిలిచేలా ప్రత్యేక ప్లాట్‌ఫాంలు, షాపింగ్ జోన్లు, పార్కింగ్ సెల్లార్‌లు, ప్రయాణికుల కోసం ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడా రాజీ పడకూడదని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. వరంగల్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసే దిశలో ఈ బస్టాండ్ కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.



