పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం మౌనం
టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచుకాల లింగారావు
విద్యారంగానికి తక్కువ కేటాయింపులపై అసంతృప్తి
కాకతీయ, కాజీపేట : పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు, డీఏలు వంటి కీలక అంశాలపై స్పష్టత లేకుండా రాష్ట్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచుకాల లింగారావు విమర్శించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించడం ఆందోళనకరమన్నారు. మొత్తం బడ్జెట్‌లో విద్యకు కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించారని, మేనిఫెస్టోలో ఇచ్చిన 15 శాతం హామీ వరుసగా మూడోసారి కూడా నెరవేరలేదని తెలిపారు. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకాలు అభినందనీయమైనవేనని చెప్పినా, పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, మధ్యాహ్న భోజన నాణ్యత పెంపుపై అదనపు నిధుల ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.1056 కోట్లు కేటాయించడాన్ని స్వాగతించినా, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి కలిగించిందన్నారు. ఇప్పటికే పీఆర్సీ అమలు 33 నెలలు ఆలస్యమైందని, మేనిఫెస్టో హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ, బకాయిలపై స్పష్టత ఇవ్వాలని లింగారావు కోరారు.


