తండాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం
శంకరం తండాలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం
మండల అధ్యక్షుడు సిద్దన రమేష్
కాకతీయ, చెన్నారావుపేట: తండాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ స్పష్టం చేశారు. చెన్నారావుపేట మండలం శంకరం తండాలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. పనుల ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దన రమేష్ మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తండాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమై ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని, చేసేదే చెబుతుందని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ లావణ్య హనుమ నాయక్ మాట్లాడుతూ గత పాలనలో గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రస్తుతం తండాలు, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్, జిల్లా కార్యదర్శి మోగిలి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


