రంజాన్ కు ఏర్పాట్లు పూర్తి చేయండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
ఈద్గాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కాకతీయ, వరంగల్ : ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హన్మకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగర పరిధిలోని ఈద్గాల్లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్/గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నగరంలోని ఎల్‌బీ నగర్, మాట్వాడ, బొక్కలగడ్డ ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, అక్కడ కొనసాగుతున్న శానిటేషన్, తాగునీరు, లైటింగ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సమగ్రంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా ప్రార్థనలు ప్రశాంతంగా నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈద్గాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, చెత్త తొలగింపు, శుభ్రపరిచే పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు. శానిటేషన్ ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయంతో పని చేసి, ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్థానిక మత పెద్దలతో మాట్లాడి వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, షామియానా, టెంట్లు, మంచినీటి, సౌండ్ సిస్టం తదితర అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా. రాజారెడ్డి, ఈఈలు రవి కుమార్, సంతోష్ బాబు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


