రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
త్యాగం, సేవా భావానికి ప్రతీక
మైనార్టీ సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి
: మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం: రంజాన్ మాసం త్యాగం, నియమం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఈ పవిత్ర మాసం మనిషిలో సహనం, కరుణ, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రకటనలో ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు. షాదీ ముబారక్ పథకం, మైనార్టీ గురుకుల పాఠశాలలు, స్కాలర్షిప్లు, విదేశీ విద్యా సహాయం, వృత్తి శిక్షణ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. తన ఎంపీ పదవీకాలంలో మైనార్టీల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి రిజర్వేషన్లపై పోరాటం చేశానని గుర్తుచేశారు. మసీదుల అభివృద్ధి, దర్గాల సంరక్షణ, హజ్ యాత్రికులకు సౌకర్యాల కల్పన వంటి చర్యలను వివరించారు. రంజాన్ పర్వదినం ప్రతి ఇంట ఆనందం, ఆరోగ్యం, శాంతి నింపాలని ఆకాంక్షించారు.


