13 నెలల పసిపాపకు గుండె ఆపరేషన్
అండగా నిలిచిన వంటేరు ప్రతాప్ రెడ్డి
పుట్టుకతో గుండె సమస్యతో బాధపడుతున్న అనూష
సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో శస్త్రచికిత్స
పాపను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత
కాకతీయ, గజ్వేల్ : పుట్టుకతోనే గుండె సమస్యతో బాధపడుతున్న 13 నెలల పసిపాపకు గుండె ఆపరేషన్ చేయించి మానవత్వాన్ని చాటిన గజ్వేల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన అనేమైన సరిత సిద్ధులు దంపతుల కుమార్తె అనూష పుట్టుకతోనే గుండెలో రక్త ప్రసరణలో లోపం ఉందని వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించగా సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండగా, గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిలుకూరి మధుసూదన్ రెడ్డి ద్వారా విషయం వంటేరు ప్రతాప్ రెడ్డి దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన కొండపాకలోని సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో పాపను చేర్పించి, వైద్యులతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేసి శస్త్రచికిత్స చేయించారు. శుక్రవారం పాప స్వగ్రామానికి చేరుకున్న సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వంటేరు శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జయమ్మ, నాయకులు కేశమైన మహేందర్, వార్డు సభ్యులు జూపల్లి బంగారి మధు, నర్సింలు, గ్రామ నాయకులు స్వామి, సిద్ధులు బాల్‌రాజు, బాల్ నర్సింలు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


