టెన్త్ పరీక్షలకు గుడ్‌బై?
విద్యావ్యవస్థలో మార్పులపై సీఎం సంచలన వ్యాఖ్యలు
ఎస్ఎస్‌సీ బోర్డు రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన
+2 విధానంపై రాష్ట్రంలోనూ అమలు యోచన
విద్యా సంస్కరణలపై అధ్యయనం కొనసాగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని, భవిష్యత్తులో పదో తరగతి పరీక్షలు ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో అమలులో ఉన్న +2 విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని తెలిపారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యా రంగంలో సంస్కరణల కోసం కమిటీ అధ్యయనం చేస్తోందని, ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికే తుది నిర్ణయం కాదన్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా మార్పులు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేతల వైఖరిని విమర్శించిన సీఎం, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తీరు హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ గృహనిర్బంధంపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పూర్తయ్యాకే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే తాను కూడా విచారణకు హాజరవుతానన్నారు. భూముల అమ్మకాలపై కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, కానీ వచ్చిన డబ్బును దుర్వినియోగం చేయడానికే వ్యతిరేకమన్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గబోమని, ప్రభావితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్ అంశంపై బీజేపీ స్పందించకపోవడంపై ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ, ఎవరు విచారణ కోరినా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.


