దళారులను నమ్మొద్దు
ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర నిర్ణయం
పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియకు ఆదేశాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రైతులు దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. రైతులకు మేలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డ్‌లో తెలంగాణ మార్క్‌ఫెడ్ మరియు నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే మొక్కజొన్నలో తేమ శాతం 14 శాతం మించకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన నగదు రైతుల ఖాతాల్లో సమయానికి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డ్‌లో రైతులకు తాగునీరు, నీడ కోసం షెడ్లు, విశ్రాంతి గదులు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డిసిఓ నీరజ, డిఎం మార్క్‌ఫెడ్ రంజిత్ రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


