విజయ డెయిరీలో కొత్త పాల విధానం
ఉపసంచాలకులు డాక్టర్ కె. శ్రవణ్ కుమార్
కాకతీయ, వరంగల్: వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించడంతో పాటు ఉత్పత్తులపై స్పష్టమైన వివరాలు అందుబాటులో ఉండేలా కొత్త విధానాలను అమలు చేస్తున్నామని ఉపసంచాలకులు డాక్టర్ కె. శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ చర్యలతో పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతుందని చెప్పారు. విజయ తెలంగాణ డెయిరీ, వరంగల్‌లో స్టాండర్డ్ మిల్క్ (ఎస్ఎం) (4.5% ఫ్యాట్, 8.5% ఎస్ఎన్ఎఫ్)ను ప్రారంభించారు. అలాగే అన్ని రకాల పాలు, పెరుగు ప్యాకెట్లపై ఎమ్మార్పీ, బ్యాచ్ సంఖ్యలను లేజర్ ప్రింటింగ్ ద్వారా ముద్రించే విధానాన్ని అమలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాడి రైతుల అసోసియేషన్ అధ్యక్షులు ఇరుకు దేవేందర్ రావు, పాల ఉత్పత్తిదారుల అధ్యక్షులు నరేందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. డెయిరీ అధికారుల్లో మేనేజర్ దశ్రు నాయక్, జూనియర్ మేనేజర్ పి. అశోక్ కుమార్, అకౌంట్స్ సూపరింటెండెంట్ భవాని, సేల్స్ మేనేజర్ డి. రజిత, ప్లాంట్ ఆపరేటర్ ఎస్. మణి, ల్యాబ్ అసిస్టెంట్ బి. రాణి తదితర సిబ్బంది పాల్గొన్నారు. పాల శీతలీకరణ కేంద్రాల పరిధిలో రవాణా రూట్లకు టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఆసక్తి గల వారు ఉపసంచాలకుల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.


