పెంపుడు పిల్లి చనిపోవడంతో యువతి ఆత్మహత్య
రెండేళ్లుగా విడదీయరాని బంధం
మార్జాలం చినిపోవడంతో మనోవేదన
పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఘటన..
కాకతీయ, తెలంగాణ బ్యూరో: పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి చనిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటాద్రి నివాస్‌కు చెందిన 20 ఏళ్ల హిమబిందు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె రెండేళ్ల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో హిమబిందుకు పిల్లితో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆమె ఆ పిల్లిని ఇంట్లో సభ్యుడిగా భావించేది. అయితే, అనారోగ్య కారణాల వల్ల కొద్దిరోజుల క్రితం ఆ పిల్లి చనిపోయింది. ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న పిల్లి చనిపోవటంతో హిమబిందు తట్టుకోలేకపోయింది. ఈనెల 18వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హిమబిందును పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హిమబిందు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తీవ్ర చర్చనీయాంశం
అయితే పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న హిమబిందు స్టోరీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు.. హిమబిందు తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. అవి జంతువులు అని.. ఎంత ప్రేమ ఉన్నా.. ఏదో ఒక రోజు అవి చనిపోవాల్సిందేనని పేర్కొంటున్నారు. ఒకటి చనిపోతే ఇంకో పిల్లిని తీసుకువచ్చి పెంచుకోవచ్చు కానీ.. ఇలా ప్రాణాలు తీసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. అవి కేవలం జంతువులే కానీ.. ఒకసారి వాటితో బంధం ఏర్పడితే మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తామని చెబుతున్నారు. కానీ ఆమె పిల్లి కోసం చనిపోవడం మాత్రం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.


