అనాథ పిల్లలతో ఉగాది పండుగ సంబరాలు
సేవా కార్యక్రమంతో ప్రత్యేకత చాటుకున్న చైర్పర్సన్
నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్
కాకతీయ, నర్సంపేట టౌన్: అనాథ పిల్లలతో కలిసి ఉగాది పండుగ జరుపుకోవడం ద్వారా సేవాభావం చాటుకున్నట్లు నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ తెలిపారు. ఉగాది సందర్భంగా మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంజీవని అనాథ ఆశ్రమాన్ని ఆమె సందర్శించి పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆశ్రమ నిర్వాహకుల ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న ఆమె, పిల్లలతో సమయం గడిపి వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా పిల్లలకు పిండి వంటకాలు, భోజనం ఏర్పాటు చేయించి, ఉగాది పచ్చడిని వారితో కలిసి స్వీకరించారు. పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ అనాథ పిల్లలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి అవసరాలకు అనుగుణంగా సహాయ సహకారాలు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆశ్రమ నిర్వాహకులు, పిల్లలు కలిసి చైర్‌పర్సన్‌ను శాలువాతో సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


