సమ్మక్క పూజారి కృష్ణయ్యకు ఉగాది పురస్కారం
గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు గుర్తింపు
దేవాదాయ శాఖ ఈఓ వీరాస్వామి
కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన సంప్రదాయాల పరిరక్షణలో తన సేవలకు గుర్తింపుగా మేడారం సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యకు ఉగాది పురస్కారం లభించిందని దేవాదాయ శాఖ ఈఓ వీరాస్వామి తెలిపారు. కాకతీయ, ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణలో కృష్ణయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఆలయాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పూజారులను గుర్తించి ఈ పురస్కారాలను అందజేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో గిరిజన ఆచారాలు, సంప్రదాయాల పరిరక్షణలో విశేష కృషి చేసినందుకు కృష్ణయ్యను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన సేవలు మేడారం జాతరకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొక్కెర కృష్ణయ్య మాట్లాడుతూ తనకు ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం రావడానికి సహకరించిన దేవాదాయ శాఖ అధికారులకు, ముఖ్యంగా ఈఓ వీరాస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో సేవలు అందిస్తానని తెలిపారు. కృష్ణయ్యకు పురస్కారం లభించడంతో మేడారం ప్రాంతంలో ఆనందం వెల్లివిరిసింది. పలువురు పూజారులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


