ఉగాది వేళ గజ్వేల్‌లో ఎడ్ల బండ్ల వైభవం
ఆకట్టుకున్న సాంప్రదాయ ప్రదర్శన వేడుక
కాకతీయ, గజ్వేల్: తెలంగాణ సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బిఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ఎడ్ల బండ్ల ప్రదర్శనను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఎర్రవాడ బాలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సాంప్రదాయ కార్యక్రమం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులతో విడదీయలేని అనుబంధం ఉన్న ఎడ్ల బండ్ల ప్రదర్శనను ఉగాది సందర్భంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడలు, పండుగల ద్వారా మన సంస్కృతి సజీవంగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎర్రవాడ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ చందన రవి, వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్ కార్ పద్మ భాయి నర్సింగ్ రావు, కౌన్సిలర్ శ్రీధర్, బిఆర్ఎస్ నాయకులు బొగ్గుల సురేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


