దొంగతనం కేసులో నలుగురు అరెస్టు
రూ.60 వేల విలువైన కరెంటు వైర్లు స్వాధీనం
సీఐ నిరంజన్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ రూరల్: దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు వేగంగా స్పందించి కేసును ఛేదించామని తెలిపారు. నగునూరు గ్రామంలోని సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్‌లో ఈ నెల 15న రాత్రి స్టోర్ రూమ్‌లో ఉన్న సుమారు రూ.60 వేల విలువైన కరెంటు వైర్ బండిల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తీగలగుట్టపల్లి–ఆరేపల్లి మార్గంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య అలియాస్ జంపరాజు, సూర శివాజీ, సూర నవీన్ దొంగతనానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన కరెంటు వైర్లను పొదల్లో దాచినట్లు తెలిపి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చి కూలి పనులు చేస్తూ మద్యం అలవాటుతో ఈ నేరానికి పాల్పడ్డట్లు వెల్లడైంది. కేసు ఛేదనలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, కానిస్టేబుళ్లు సల్మాన్, అఫ్జల్‌లు ప్రతిభ కనబర్చగా సీఐ అభినందించారు.


