ఖమ్మం రోడ్లకు మహర్దశ
డిప్యూటీ సీఎం భట్టి చొరవతో మారనున్న మార్గాలు
రూ.594 కోట్లతో ఐదు రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
వైరా–జగ్గయ్యపేట, మధిర–తూటికుంట్ల రోడ్ల నిర్మాణానికి నిధులు
నాలుగు వరుసల రహదారులతో మారనున్న రవాణా దృశ్యం
ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల్లో పెరగనున్న కనెక్టివిటీ
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి రహదారి మౌలిక వసతులు కీలకమని పేర్కొంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లాలోని ఐదు ప్రధాన మార్గాల విస్తరణకు ప్రభుత్వం రూ.594 కోట్ల భారీ నిధులు మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి అభివృద్ధి పనులు వేగం అందుకోనున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా ఖమ్మం ప్రజలకు ఇది తీపి కబురుగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 15 (16-03-2026) ప్రకారం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా ఈ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడం ప్రధాన లక్ష్యంగా ప్రాజెక్టును రూపుదిద్దారు.

ఐదు మార్గాల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
వైరా నుండి జగ్గయ్యపేట వరకు 25.2 కిలోమీటర్ల రహదారిని రూ.151.20 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. మధిర–తూటికుంట్ల మార్గాన్ని 13.50 కిలోమీటర్ల మేర రూ.81 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. మధిర–ఎర్రుపాలెం రహదారిని 18.40 కిలోమీటర్ల మేర రూ.110.40 కోట్లతో విస్తరించనున్నారు. ఖమ్మం నుంచి బోనకల్ వరకు 28.03 కిలోమీటర్ల రహదారికి రూ.157.23 కోట్లు కేటాయించారు. అలాగే బోనకల్–ఆళ్లపాడు–రాయన్నపేట–వంగవీడు మార్గాన్ని 15.72 కిలోమీటర్ల మేర రూ.94.32 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మార్గాలు జగ్గయ్యపేట, బోనకల్, రావినూతల, ముజఫర్ నగర్, జానకీపురం, పెద్దబీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తాండా, సోమవరం, మధిర, జిలుగుమాడు, ఆత్కూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్మణపల్లి, ఎల్లెందులపాడు, దెందుకూరు, మీనవోలు, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల, ఆళ్లపాడు, రాయన్నపేట, వంగవీడు ప్రాంతాలను కలుపుతూ అభివృద్ధి చెందనున్నాయి.
ఆర్థికాభివృద్ధికి బూస్ట్
ఈ రహదారుల విస్తరణతో ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల్లో కనెక్టివిటీ పెరుగుతుంది. రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులు, వ్యాపారులకు ప్రత్యక్ష లాభం చేకూరనుంది. స్థానిక మార్కెట్లకు సరుకు రవాణా వేగవంతమవడంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. మొత్తంగా ఖమ్మం జిల్లా రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలవనుంది.


