ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్య
ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ కళాశాల ప్రవేశాల బ్రోచర్ ఆవిష్కరణ
కాకతీయ, స్టేషన్‌ఘన్‌పూర్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరి నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు. హన్మకొండ కనకదుర్గ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2026-27 విద్యాసంవత్సర ప్రవేశాల బ్రోచర్‌ను ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయడంలో ప్రభుత్వ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉచిత కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రభుత్వం స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, టీఎస్కేసీ ద్వారా ఉద్యోగావకాశాలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, పోటీ పరీక్షల మార్గదర్శకత్వం అందిస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళి, అధ్యాపకులు నాగరాజు, సుమలత, అఖిల తదితరులు పాల్గొన్నారు.


