అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
గాంధీభవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
కాకతీయ, హైదరాబాద్ : రాబోయే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండి రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాకతీయ, హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం వీక్షించి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ‘పరాభవ’ నామ సంవత్సరంలో దుష్టశక్తులకు పరాభవం కలగాలని, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబం ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు పార్టీ శ్రేణులను ఈ సందర్భంగా అభినందించారు.


